మామూలుగా కాలుకు ముళ్లు గుచ్చుకుంటేనే విలవిలలాడుతాం. అలాంటిది ఓ యువకుడి తలలో ఏకంగా 8 మేకులు దిగాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. అది అట్లుంటే.. ఆ ఎనిమిది మేకులను తొలగించి ఆ యవకున్ని కాపాడారు డాక్టర్లు. రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు డ్రిల్ వర్క్ చేస్తుంటాడు. పని చేస్తుండగా డ్రిల్ మిషన్ నుండి వచ్చిన 8 మేకులు ఆ వ్యక్తి తలలో దిగాయి.
వెంటనే అతన్ని రాజస్థాన్ జోధ్పుర్ లోని ఎండీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించి ఎక్స్రే, సీటీ స్కాన్ లు తీసిన వైద్యులు అతని తలలో 8 మేకులు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ కొంచెం అటు ఇటు అయినా యువకుడు జ్ఞాపకశక్తి కోల్పోవడమో, పక్షపాతం వచ్చే ప్రమాదమో ఉంటుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతితో ఆపరేషన్ మొదలు పెట్టిన వైద్యులు.. 2 రోజులు కష్టపడి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఆ యువకుడి ప్రాణాలను కాపాడారు.
ఆస్పత్రిలోని న్యూరో సర్జరీ డిపార్ట్ మెంట్ ఇన్ ఛార్జ్, ఆచార్య డా.శరద్ తన్వి నేతృత్వంలోని వైద్య నిపుణల బృందం ఈ ఆపరేషన్ చేసింది. డిసెంబర్ 18న ఆ యువకున్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఎక్స్రే, సీటీ స్కాన్ ఆధారంగా ఓ మేకు అతడి మెదడులోకి లోతుగా దిగినట్లు గుర్తించి అత్యంత జాగ్రత్తగా సర్జరీ చేసినట్లు వైద్యులు చెప్పారు.
ఎలాంటి సమస్య రాకుండా మెకులను తొలగించామన్నారు వైద్యులు. 10 రోజులు అబ్సర్వేషన్ లో ఉంచిన తర్వాత డిశ్ఛార్జ్ చేశామని తెలిపారు. ఇప్పుడు అతడు సాధారణ వ్యక్తిలా పూర్వస్థితికి వచ్చాడని వెల్లడించారు. ఇది అత్యంత సున్నితమైన ఆపరేషన్. ఏ మాత్రం తేడా జరిగినా యువకుడు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేదని వెల్లడించారు. అందుకే రెండు దశల్లో ఈ సర్జరీ పూర్తి చేశామన్నారు. తొలి రోజు 7 మేకులను తల నుంచి బయటకు తీశామని.. కుడివైపు మెదడు లోపలికి చొచ్చుకెళ్లిన మరో మేకును మరునాడు వెలికితీశాని స్పష్టం చేశారు. ఎంతో రిస్క్ తో కూడుకున్న ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేయడం ఆనందంగా ఉందంటున్నారు ఎండీఎం ఆస్పత్రి వైద్యులు.