కరోనా.. కరోనా.. ఎవరి నోటి నుండి విన్నా ఈ మాటే తప్ప వేరే మాటే వినిపించడం లేదు. దానిని ఆరికట్టే ప్రయత్నంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ.. తమ ప్రణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. తమ ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని రోగులకు సేవలను అందిస్తున్నారు. అయితే.. సాధారణ గ్రాయాల్లో తిరిగి సేవలు అందించడం ఒక భాగం. కానీ.. ఎడారి ప్రాంతాల్లోని మారు మూల గ్రామాలకు వెళ్లడం అనేది సాహసోపేతమైన పనిగానే చెప్పుకోవచ్చు. అదికూడా రక్తం గడ్డ కట్టే మంచుకొండల నడుమ నడుచుకుంటూ వెళ్లడం అంటే ఇగ ఆ బాధ చెప్పనవసరం లేదు.
జమ్ముకశ్మీర్ ను హిమపాతం వణికిస్తోంది. బారాముల్లా, రాంబన్ సహా అనేక జిల్లాల్లో భారీగా కురుస్తున్న మంచు వర్షానికి రోడ్లపై సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ జమ్ముకశ్మీర్ ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది. అందుకు వైద్య సిబ్బంది అదే తరహాలో కష్టపడుతున్నారు.
బారాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలోని గ్రామాలకు సైన్యం సాయంతో వెళుతున్న ఆరోగ్య కార్యకర్తలు.. అర్హులందరికీ టీకాలు అందిస్తున్నారు. మంచు వర్షం, సరైన రహదారులులేని కారణంగా ఆరోగ్య కార్యకర్తలు, సైనికులు కాలినడకనే ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు.
సైన్యం సాయం లేకుంటే సరిహద్దుల్లో తాము ఎక్కువ మందికి టీకాలు అందించలేకపోయేవాళ్లం అని బారాముల్లా బ్లాక్ వైద్యాధికారి డాక్టర్ పర్వేజ్ మసూద్ తెలిపారు. ఓ పక్క రక్తం గడ్డ కట్టే చలి.. చుట్టూ మంచు కొండలు.. వాటి మధ్యలో నుండి నడుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో.. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు టీకా అందిస్తున్న వైద్యాధికారులను, సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు.