తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, ఉద్యమానికి కొమురయ్యని స్ఫూర్తిగా తీసుకున్నామని వెల్లడించారు మంత్రి హరీష్ రావు. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కురుమ సంఘం బహిరంగ సభలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. బాల్యవివాహాలను ఆపింది సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. కళ్యాణలక్ష్మి పథకానికి 18 సంవత్సరాలు అర్హత పెడితే బాల్య వివాహాలు ఆగిపోయాయని తెలిపారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ శాఖ కావాలని ఆడిగామని, ఇప్పటివరకు ఎలాంటి అతీగతీ లేదని మండిపడ్డారు. వాళ్లకి ఎప్పుడూ అంబానీ, అదానీ కావాలని ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో కురుమ భవన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉగాది, శ్రీ రామనవమి తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని, యూనిట్ కాస్ట్ కూడా పెంచామన్నారు హరీష్.
కొమురవెల్లి మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేనని గుర్తు చేశారు. కురుమలకు కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ పదవి ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేసీఆర్ ఏ పని చేసిన వాటికి దేవుళ్ల పేరే పెడతారని పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ నిర్మించినప్పుడు ఇది పూర్తవుతుందా? అని ప్రతిపక్షాలు హేళన చేశాయని గుర్తు చేశారు. కానీ ముఖ్యమంత్రి మూడున్నర సంవత్సరాల్లో పూర్తి చేసి చూపించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన కేసీఆర్ గురించి గొప్పగా చెబుతున్నారన్నారు తెలిపారు మంత్రి హరీష్ రావు.