పాలకూర, టొమాటో కలిపి తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయి అనే ప్రచారం ఉంది. అసలు ఈ ప్రచారం ఎంత వరకు నిజం…? ఆ రెండు ఆరోగ్యకరమైనవి కదా అయినా సరే ఈ సమస్య ఎందుకు అనే సందేహం చాలా మందిలో ఉంది. అసలు దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. అనేక విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కాల్షియం, పొటాషియం, సి-విటమిన్ వంటివి పాలకూరలో అధిక మోతాదులో ఉన్నాయి. పాలకూరలో ఆక్జలేటు అనే సేంద్రీయ కారకం అధికం.
దానికి ఇనుము లవణాలలోనూ కాల్షియం లవణాలలోనూ కలిసి ఐరన్ ఆక్జలేటు, కాల్షియం ఆక్జలేటులను ఏర్పరచే స్వభావం కలిగి ఉంది. ఇక టమాటాలో కూడా ఎన్నో విలువైన ఖనిజ లవణాలు, విటమిన్లతో పాటుగా ఆక్జలేటులు ఉన్నాయి. దీనిలో కూడా పొటాషియం పరిమాణం ఎక్కువగానే ఉంది. అందువల్ల టమాటా కూడా ఆరోగ్య రీత్యా అద్భుతమైన కూరగాయ గానే చెప్పాలి.
పాలకూర, టమాటాలలో అధిక మోతాదులో ఉన్న ఆక్జలేటులు మన రక్తంలో ఉన్న కాల్షియం, ఇనుము లవణాలను ఆయా ఆక్జలేటులుగా మార్చే పరిస్థితి ఎక్కువ. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డం వింటాం కదా… ఆ రాళ్లలో ఉండేవి ప్రధానంగా కాల్షియం సిట్రెట్‌లు, కాల్షియం ఫాస్పేట్‌లు, కాల్షియం ఆక్జలేటులు. రక్తంలోనూ, మూత్రంలోనూ సరైన మోతాదులో నీటి శాతం లేనట్త్లెతే రసాయనికంగా ఆక్జలేట్ల పరిమాణం, ఫాస్పేట్ల పరిమాణం మోతాదును మించి ఉంటే అవాంఛనీయంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. మోతాదును మించితేనే ప్రమాదం ఎక్కువ. పరిమిత స్థాయిలో పాలకూర టమాటాలను కలిపి తిన్నంత మాత్రాన కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉండదు. రోజూ నీళ్లు ఎక్కువ తాగితే మాత్రం ఈ ప్రమాదం తక్కువ.