వింత వింత నిబంధలు పెట్టి వార్తల్లోకెక్కడంలో జపాన్ లోని పాఠశాలలు ముందుంటాయి. గతంలో విద్యార్థులకు వైట్ అండర్ వేర్ పాలసీలు తీసుకు వచ్చి కొన్ని స్కూల్స్ వార్తల్లో నిలిచాయి.
తాజాగా స్కూల్స్ లో విద్యార్థినులు పోనీ టైల్స్ వేసుకోవడంపై కొన్ని స్కూల్స్ నిషేధం విధించాయి. దానికి ఒక అసంబద్ధమైన కారణాన్ని చెబుతున్నాయి. దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మోటోకి సుగియామా అనే మిడిల్ స్కూల్ మాజీ టీచర్ మాట్లాడుతూ… విద్యార్థినులు పోనీ టైల్ వేసుకోకూడదని పాఠశాలల యాజమాన్యం తనకు చెప్పినట్టు తెలిపారు.
పోనీటైల్ వేసుకుంటే విద్యార్థినుల మెడ వెనక భాగం ఎక్స్ పోజ్ అవుతుందని, అది మగ విద్యార్థులను లైంగికంగా ఉత్తేజ పరిచే అవకాశం ఉందని వారు తనకు చెప్పినట్లు వెల్లడించారు.
‘ వారి బాధంతా అమ్మాయిలను అబ్బాయిలను చూస్తారనే. అందుకే గతంలో కూడా వైట్ అండర్ వేర్ నిబంధనను తీసుకు వచ్చారు. నేను ఇలాంటి వాటిని ఖండిస్తాను. దీనిపై ఎవరూ విమర్శలు చేస్తుండకపోవడంతో అది ఓ సాధారణ విషయంగా మారిపోయింది” అని అన్నారు.
‘ గతంలో ఎన్ని పాఠశాలల్లో పోనీటైల్స్ పై నిషేధం విధించారన్న గణాంకాలు ఉండేవి కాదు. కానీ 2020 లో చేసిన సర్వే ప్రకారం ఫుకొవొకా పరిధిలో పది పాఠశాలల్లో ఒక్కంటిలో ఈ నిబంధనలు అమలవుతున్నాయి’ అని తెలిపారు.