– కాలం కలిసొచ్చేనా?
– బీఆర్ఎస్ గట్టెక్కుతుందా?
– కేసీఆర్ కొత్త యుద్ధం ఎంతమేర ఫలిస్తుంది?
– బీఆర్ఎస్ ను జాతీయ స్థాయిలో నడిపించగలరా?
– మోడీని నిలువరించే వ్యూహాలేంటి..?
– విపక్ష పార్టీల అధినేతలు కేసీఆర్ ని విశ్వసిస్తారా?
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇప్పుడు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ రణక్షేత్రంలో బిజెపి తరచూ టీఆర్‌ఎస్‌కు వెన్నులో వణుకు పుట్టించేలా ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తోంది. క్షేత్రస్థాయిలోనూ పార్టీ పటిష్టమయ్యేలా శ్రమిస్తోంది. బండి సంజయ్ పాదయాత్ర, ప్రధానమంత్రి సహా, అగ్రనేతలందరూ సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణలో పర్యటించడం వంటి పరిణామాలు అధికార టీఆర్‌ఎస్ కు ఇబ్బందిగా మారాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్‌ఎస్ వైఫల్యాలపై గతంలో కన్నా ఇప్పుడు గట్టిగా స్పందిస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ ఎంపికైన తర్వాత కొత్త వ్యూహాలకు పదునుపెడుతూ.. పార్టీలో కొత్త ఆశలు చిగురింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తుతూ, కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనేలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ పరిణామాలతో టీఆర్‌ఎస్ భవిష్యత్తు ఏంటనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముందు ఇల్లు చక్కదిద్దుకొని.. అంటే తెలంగాణలో పరిస్థితులు బాగు చేసుకొని, కేసీఆర్ జాతీయ రాజకీయాల నినాదం ఎత్తుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. అయితే.. రచ్చ గెలవాలనే కోరికతో కేసీఆర్ జాతీయ పార్టీ వైపు వడివడి అడుగులు వేస్తున్నారు.
స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి అయి ఇప్పుడు యావత్ భారతదేశం మీద కన్నేశారు కేసీఆర్. భారత రాష్ట్రీయ సమితి పార్టీ(బీఆర్ఎస్)ని స్థాపించబోతున్నారు. వాస్తవానికి దాదాపు గత ఐదారేళ్ల నుంచే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ, థర్డ్ ఫ్రంట్ అంటూ హడావుడి చేస్తున్నారు. కానీ, ఎప్పుడూ దానిని సీరియస్ గా తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. అప్పుడప్పుడూ ఈ అంశంపై మాట్లాడటం, బహిరంగ సభల్లో ప్రస్తావించడం, కొన్నిసార్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లి బీజేపీయేతర పార్టీల నేతలను, రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలను కలవడానికే పరిమితమయ్యారు. మొన్నటికి మొన్న కూడా ఉత్తర భారత పర్యటన, కర్ణాటక, మహారాష్ట్ర యాత్ర పేరిట హల్‌చల్ చేశారు. ఉత్తరాది టూర్ ను అర్ధాంతరంగా ముగించుకున్నారు. గతంలోనూ ఫ్రంట్ టెంటును కాపాడుకోలేక చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ పార్టీ.. దేశంలో బలంగా ఉన్న బిజెపిని ఎంతవరకు ఎదుర్కోగలదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నరేంద్ర మోడీని నిలువరించే వ్యూహాలు ఒక్క కేసీఆర్ తో ఏమాత్రం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మోడీకి వ్యతిరేకంగా గొంతు కలుపుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తో పోల్చితే తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం. ఇక్కడ 17 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో ఇందులో కేసీఆర్ ఎన్ని స్థానాల్లో గెలుస్తారో తెలియదు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వ్యతిరేక ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించడానికి ఇతరులు అంగీకరించే అవకాశం కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్న మాట. మరోవైపు జాతీయ స్థాయిలో ప్రజల ఆలోచనతీరు భిన్నంగా ఉంటుంది. విభిన్న మనస్తత్వాలు, వేర్వేరు ఆకాంక్షలు, అనేక అభిప్రాయ భేదాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ స్థాయిలో విజయం సాధించడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు జరుగుతున్నాయి.
కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో మరో వాదన కూడా నడుస్తోంది. తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారనే వాదనలు వినపడుతున్నాయి. గతంలోనూ చాలాసార్లు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, ఎప్పటికప్పుడు ఆ ప్రతిపాదనకు అడ్డుకట్ట పడుతోంది. ఇప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటు చేసి, కేసీఆర్ ఢిల్లీ బాట పడితే.. అనివార్యంగా కేటీఆర్ ను సీఎం చేయవచ్చని, అప్పుడు రాజకీయంగా వచ్చే విమర్శలకు, ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే అస్త్రం దొరుకుతుందనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాల కంటే ముందే జాతీయ పార్టీని ప్రకటించాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. కానీ.. ఇప్పుడు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ పార్టీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కేవలం 17 ఎంపీ సీట్లతో జాతీయ పార్టీ అంటూ బీరాలు పలకడం అత్యాశకు పోవడమే అనే వాదన జరుగుతోంది.
ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ వంటి చరిష్మా ఉన్న రాజకీయ నేత జాతీయ పార్టీ పెట్టాలని ఆలోచించి వెనక్కి తగ్గారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లోనే జాతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన వర్కవుట్ కాలేదు. మరి.. 17 సీట్లున్న కేసీఆర్.. జాతీయ పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతారనేదే ప్రశ్నగా మారింది. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న ఆలోచనలతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో పైకి తేలుతారో నిండా మునుగుతారో వేచి చూడాల్సిందే.