ధనవంతుల ఇళ్లల్లో పెంపుడు జంతువులు ఎంతటి రాజభోగాలు అనుభవిస్తాయో చాలా సార్లు చూసే, వినే ఉంటాం. ఆ రిచ్‌మెన్ మాత్రం తన ప్రేమ అంతకుమించి అని నిరూపించుకున్నాడు. తన పెంపుడు కుక్క కోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లోని బిజినెస్ మొత్తాన్ని బుక్ చేశాడు. బిజినెస్ క్లాస్‌లో తాను, తన కుక్క మాత్రమే కలిసి దర్జాగా ప్రయాణించారు.
సీట్లు బుక్ చేసిన ఎయిర్ ఇండియా ఏ 320 ఫ్లైట్‌లోని జే క్లాస్ క్యాబిన్‌లో 12 సీట్లు ఉంటాయి. ఇందులో ముంబై -చెన్నైకి బిజినెస్ క్లాస్ సీట్ బుక్ చేసుకోవాలంటే.. రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. అలా మొత్తంగా తన పెంపుడు కుక్క కోసం రూ. 2.5 లక్షలకుపైగా ఖర్చుచేశాడా యజమాని. సాధారణంగా దేశంలో విమానాల్లో ప్రయాణించేందుకు జంతువులని అనుమతించరు కానీ, ఎయిర్ ఇండియా మాత్రం అందుకు మినహాయింపునిస్తోంది.
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లోని బిజినెస్ క్లాస్‌లో గతంలో చాలా మంది పెంపుడు కుక్కలని తమ వెంట తీసుకెళ్లారు. కానీ ప్రత్యేకంగా బిజినెస్ క్లాస్ మొత్తాన్ని కుక్క కోసమే బుక్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సాధారణంగా ఒక ఫ్లైట్‌లో ఒకేసారి రెండు జంతువులను మాత్రమే ప్రయాణానికి అనుమతి ఇస్తారు. అందులోనూ వాటిని చివరి సీటులోనే వాటిని కూర్చోబెట్టాల్సి ఉంటుంది.