ఉక్రెయిన్ ను ఆక్రమించే ప్రయత్నంలో రష్యా సాగిస్తున్న మారణ కాండ ఇంకా సాగుతూనే ఉంది. మాతృభూమిని కాపాడుకునేందుకు ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను అర్పిస్తున్నారు. ఎంతోమంది పౌరులు సైతం తమ దేశ రక్షణ కోసం పోరాడేందుకు సిద్ధం అయ్యారు. సైనికుల తమ కళ్ల ముందే ప్రాణాలను కోల్పోతున్నప్పటికీ.. ఉక్రెయిన్ పౌరులు తమ గడ్డ కోసం పోరాడుతూనే ఉన్నారు.
అయితే అక్కడ జంతువులు కూడా పోరాటంలో భాగమయ్యాయి. ఓ రెండేళ్ల కుక్క రష్యా దళాలు పెట్టిన బాంబులను గుర్తించి.. నిర్వీర్యం చేయడంలో సహకరిస్తుంది. పాట్రన్ అనే రెండేళ్ల కుక్క ఉక్రెయిన్ లోని పలు చోట్ల ఉన్న ప్రమాదకరమైన బాంబులను గుర్తించి హీరోగా మారింది. ఇప్పటి వరకూ 99 పేలుడు పదార్థాలను గుర్తించినట్టు తెలుస్తోంది.
ఆ కుక్కకు సంబంధించిన ఓ వీడియోను స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో పాట్రన్ గురించి వివరాలను తెలియజేశారు. “మా మిలిటెంట్ డాగ్ యుద్ధంలో తన సేవలను అందిస్తుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 90 పేలుడు పదార్థాలను గుర్తించింది. మా మిత్రమా అలుపురాని నీ పనికి ధన్యవాదాలు” అంటూ వీడియోకు ట్యాగ్ చేస్తూ రాసుకొచ్చారు.
ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాంబులను, ల్యాండ్‌మైన్స్‌ను గుర్తించి పాట్రన్ ఎంతోమంది ప్రాణాలను కాపాడిందంటున్నారు నెటిజన్లు. ఈ కుక్క మిరాకిల్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దానిని జాగ్రత్తగా చూసుకోమని సలహాలు కూడా ఇస్తున్నారు. ఇది జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన కుక్క అది.