సామాన్యుడిపై మరోసారి వంటగ్యాస్ భారం పడింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర రూ.3.50 పైసలు పెంచాయి చమురు కంపెనీలు. దీంతో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,003 కు చేరింది. ఇటు వాణిజ్య సిలిండర్ ధరను రూ.8 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి సంస్థలు.
ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. దేశం కోసం ధర్మం కోసం మోడీ సర్కార్ మరోసారి గ్యాస్ ధరలు పెంచిందని సెటైర్లు వేశారు. ఈ భారాన్ని మీరు మోయలేక గొంతువిప్పి ప్రశ్నిస్తే దేశద్రోహులు.. ధర్మం తప్పినవారు అవుతారని బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సర్టిఫై చేస్తుందని అన్నారు. దేశవాసులారా జాగ్రత్త అంటూ హెచ్చరించారు రేవంత్.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరల పెంపుతో సామాన్యుడి జేబు ఖాళీ అవుతోంది. ఆ భారాన్ని మోయలేక మోస్తున్న వారికి తాజాగా పెంచిన వంటగ్యాస్ ధర మరింత అదనపు భారంగా మారింది.
ఈనెలలో గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి. మే 7న సిలిండర్ పై రూ.50 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకన్నాయి. అంతకుముందు మార్చి 22న కూడా రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి.