దేశంలో గృహ హింస పెరుగుతున్నదని జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నాటి నుండి తమకు 250 ఫిర్యాదులు అందాయని, అందులో 69 కేసులు కేవలం గృహ హింసకు సంబంధించినవేనని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ గురువారం తెలిపారు. దేశంలో గృహ హింస ప్రమాద ఘంటికలు మోగిస్తున్నదని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.
రాష్ట్రాల వారీగా గృహ హింసకు సంబంధించిన కేసుల వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా 90 కేసులతో ఉత్తరప్రదేశ్ తొలి స్ధానంలో ఉండగా 37 కేసులతో ఢిల్లీ తరువాత స్థానంలో ఉందని తెలిపారు.మార్చి 2 నుండి 8 తేదీల మధ్య గృహ హింసకు సంబంధించి 30 ఫిర్యాదులు అందగా మార్చి 23 నుండి 30 మధ్య 58 ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపారు. ఇదే సమయంలో అత్యాచారం, అత్యాచార యత్నం, కట్నం వేధింపులు తదితర నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు స్వల్పంగా తగ్గాయని ఎన్‌సిడబ్ల్యు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.