– అధికారపార్టీలో ఆధిపత్య పోరు
– జూపల్లి వర్సెస్ బీరం
– కేటీఆర్ చెప్పినా వినలేదా?
– వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి?
– రగులుతున్న టీఆర్ఎస్ కొర్రాసు
అధికార టీఆర్ఎస్ పార్టీలో అధిపత్య కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బహిరంగంగానే తిట్టుకుంటున్న పరిస్థితి. కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చుకొని రానున్న ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే కొల్లాపూర్ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది.
స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. నాయకుల మధ్యే కాదు ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఈమధ్య బీరం హర్షవర్ధన్ రెడ్డికి జూపల్లి సవాల్ విసిరారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. దానికి స్పందించిన ఎమ్మెల్యే.. చర్చకు తాము కూడా సిద్ధమేనని.. కానీ అంబేద్కర్ చౌరస్తా కాదు.. కృష్ణారావు ఇంటికి వస్తానని అన్నారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపడ్డ జూపల్లి అనుచరులు తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. బీరం చేసిన తీవ్ర ఆరోపణలను ఖండించారు. కొల్లాపూర్ లో అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తే.. జూపల్లి ఇంటికి వస్తామని అనడం పక్కదోవ పట్టించడమే అని విరుచుకుపడ్డారు. బహిరంగ చర్చకు తాము ఎక్కడికైనా సిద్ధమని.. జూపల్లి ఇంటి దగ్గర కూడా చర్చకు సిద్ధం అని పేర్కొన్నారు. దాని కోసం ఏర్పాట్లు కూడా తామే చేస్తామని వివరించారు.
Advertisements
ఇటీవల మంత్రి కేటీఆర్ కొల్లాపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు జూపల్లి ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఇది ఎమ్మెల్యే బీరం అనుచర వర్గానికి మింగుడు పడలేదు. ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదురుతుందని అంతా అనుకున్నారు. కానీ.. అది ఆచరణలో సాధ్యం కాలేదు. వచ్చే ఎన్నికలలో టికెట్.. తమ నేతకే అని ఒక వర్గం.. కాదు మా నేతకే అని మరో వర్గం చెప్పుకుంటూ అటు సోషల్ మీడియాలో.. ఇటు బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నాయి.