మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో దారుణం చోటుచేసుకుంది. డామినోస్ పిజ్జా డెలివరీ ఉద్యోగినిపై కొంతమంది మహిళలు దాడి చేశారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దాడి చేస్తున్న డామినోస్ ఉద్యోగిని గట్టిగా కేకలు పెట్టడం వీడియోలో తెలుస్తోంది. వీడియోను నిందితులే సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు చెప్తున్నట్టు ఆ వీడియోలో వినిపిస్తోంది.
అయినప్పటికీ భయపడకుండా మహిళా గూండాలు సదరు మహిళా ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా చేతనైతే వెళ్లి పోలీసులను పిలుచుకురా అంటూ సవాల్ విసిరారు. ప్రాణ భయంతో పరుగులు పెట్టిన బాధితురాలు ఓ ఇంట్లోకి వెళ్లి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసింది.
ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బాధితురాలు నందినీ యాదవ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారాంభించినట్టు తెలిపారు. అయితే.. నిందితులను అరెస్టు చేయకుండా నోటీసులు పంపినట్లు పోలీసులపై విమర్శలు వినిపిస్తున్నాయి.