2024 లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసేందుకు తతహలాడుతున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఫేస్ బుక్ వైపు ఆశగా చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం ఫేస్ బుక్ లోని తన అకౌంట్ ని పునరుద్ధరించాలని ఆయన దీని మాతృక సంస్ధ ‘మెటా’ ని కోరుతున్నారు. రెండేళ్ల క్రితం వాషింగ్టన్ లోని క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన అనంతరం ఆయనపై ఫేస్ బుక్ బ్యాన్ విధించింది.
ఈ నిషేధం నిరవధికంగా ఉంటుందని ప్రకటించినా.. దీనిపై పునరాలోచించాలని ఈ సంస్థ ఇటీవల నిర్ణయించింది. పైగా తాజాగా నిర్ణయం తీసుకోవడానికి మెటా ఓ అంతర్గత వర్కింగ్ గ్రూప్ (కమిటీ) ని నియమించింది. మరికొన్ని వారాల్లో ఈ గ్రూప్ ట్రంప్ కి మద్దతుగా నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నారు. 2016 లో జరిగిన ఎన్నికల్లో తన ప్రచారం కోసం ట్రంప్.. ట్విట్టర్ ని, ఫేస్ బుక్ ని విస్తృతంగా వినియోగించుకున్నారు. ఆ తరువాత పదవిలో ఉన్నప్పుడు కూడా వీటిని ఆయన ‘వదలలేదు’.
క్యాపిటల్ భవనంపై తన మద్దతుదారులతో దాడి చేయించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనను పార్లమెంటు అభిశంసించినా.. ఆ తరువాత ఆ నింద నుంచి ‘నిర్దోషి’ గా బయటపడ్డారు. 2024 నవంబరులో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.
డెలావర్ లోని తన ప్రైవేట్ హోమ్ లో అధ్యక్షుడు జోబైడెన్ కొన్ని క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను దాచారన్న వార్తలు రావడంతో ఆయన రాజకీయ చిక్కుల్లో పడ్డారు. ఈ పత్రాలన్నీ బైడెన్ 2009-16 మధ్య ఉపాధ్యక్షునిగా ఉన్న కాలానికి చెందినవని ఎఫ్ బీ ఐ దాడుల్లో తేలింది. ఈ తాజా పరిణామాలను తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడానికే ట్రంప్.. మళ్ళీ తన ఫేస్ బుక్ ఖాతాను పునరుద్ధరించాలని కోరుతున్నారని భావిస్తున్నారు.