ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1బీ వీసాల విషయంలో ఆంక్షలు గుసడలించారు. వీసా నిషేధం ప్రకటనకు ముందు విడుదలైన ఉద్యోగాల కోసం అమెరికాకు తిరిగి రావాలి అనుకునే ఉద్యోగులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది.

వీసా హోల్డర్స్ మాత్రమే కాదు వారి జీవిత భాగస్వాములు, పిల్లలు సైతం అమెరికాకు వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ అడ్వైజరీ పేర్కొంది. కరోనా వైరస్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న అమెరికాను తిరిగి గాడిన పెట్టేందుకు హెచ్1బీ వీసాదార్లకు దేశంలోకి ప్రవేశించేందుకూ అమెరికా అనుమతి ఇచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.
జూన్ 22న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ సంవత్సరం చివరివరకు ఈ నిషేధం కొనసాగించనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. తద్వారా అమెరికా పౌరులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని ఆయన ప్రకటించారు. ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్ ఐటీ నిపుణులకు కొంత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.