తాలిబన్ల చేతికి చిక్కిన ఆఫ్ఘాన్ పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్ కనిపిస్తోంది. రానురాను పరిస్థితి దిగజారుతోంది. దీంతో అఫ్ఘాన్ ను ఆదుకుందాం అని పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి.
యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రపంచ దేశాలకు ఓ విజ్ఞప్తి చేశారు. 606 మిలియన్ డాలర్ల సాయం చేయాలని కోరారు. డిసెంబర్ వరకు అక్కడి ప్రజల కష్టాలు తీర్చేందుకు ఈ సాయం చేసి ప్రపంచ దేశాలు తమ మానవతా దృక్పథాన్ని చాటాలని చెప్పారాయన.
జెనీవాలో జరిగిన విరాళాల సేకరణ సదస్సులో ఈ పిలుపునిచ్చారు ఆంటోనియో. అఫ్ఘాన్ పేదలకు అందరూ సాయపడాలని.. ఐక్యరాజ్య సమితి అత్యవసర విభాగం తరఫున 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వివరించారు. అమెరికా 64 మిలియన్ల డాలర్ల సాయం చేస్తామని ప్రకటించింది.