ఆర్మీ దుస్తులు, పతకాలు ధరించి బహిరంగ సభలు, నిరసనలు , ఇతర రాజకీయపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని మాజీ ఉద్యోగులను ఇండియన్ ఆర్మీ కోరింది. సైనిక దుస్తులను ధరించే అంశానికి సంబంధించిన నిబంధలను గుర్తు చేస్తూ కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఓ లేఖను రాసింది. సాధారణంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మాత్రమే మాజీ ఉద్యోగులు ఆర్మీ దుస్తులు ధరించాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో.. పంజాబ్‌కు చెందిన కొందరు మాజీ ఉద్యోగులు ఆర్మీ డ్రెస్‌లు వేసుకొని నిరసనలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే మాజీ ఉద్యోగులు ఆర్మీ యూనిఫాంను ధరించకూడదని ఆర్మీ కోరింది. విధుల్లో ఉన్న వారు కూడా.. రైతు నిరసనలకు దూరంగా ఉండాలని సూచించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు సంఘాలు భారీ ట్రాక్టర్ ర్యాలీకి సిద్ధమవుతున్న సమయంలో.. తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.