ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం సోమవారం కీలక సూచనలు చేసింది. ఉక్రెయిన్ లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేయడంతో రైల్వే స్టేషన్లకు చేరుకోవాలని భారతీయ పౌరులకు ఇండియన్ ఎంబసీ సూచించింది.
ఈ క్రమంలో భారత పౌరులు పాటించాల్సిన మార్గదర్శకాల గురించి ఇండియన్ ఎంబసీ వివరించింది. వారాంతపు కర్ఫ్యూ ఎత్తి వేసినందున ఉక్రెయిన్ పశ్చిమ భాగాలకు చేరేందుకు భారతీయులు రైల్వే మార్గాన్ని ఎంచుకోవాలని సూచించింది.
రైల్వే స్టేషన్లకు పెద్ద ఎత్తున పౌరులు వస్తుండటంతో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, రైళ్లు కూడా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపింది. అలాంటి సమయంలో భారతీయులు దూకుడుగా వ్యవహరించకుండా ప్రశాంతంగా, సహనంగా, ఐక్యతగా ఉండాలని కోరింది.
ఇక విద్యార్థులు తమ పాస్ పోర్టులు, తగినంత ఆహారం, సులువుగా తీసుకువెళ్లడానికి అనుకూలంగా ఉండే శీతాకాల బట్టలు వంటివి మాత్రమే తీసుకువెళ్లాలని సూచనలు చేసింది.