ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో ప్రోటోకాల్ విషయంపై సీరియస్ చర్చ జరుగుతోంది. ఆహ్వానించేందుకు కేసీఆర్ రానవసరం లేదంటూ పీఎంవో సమాచారం ఇవ్వడంతో.. ఒక ముఖ్యమంత్రిని కేంద్రం అవమానించిందంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగారు. మోదీ అధికారిక పర్యటనకు వచ్చారా లేక పార్టీ ప్రతినిధిగా వచ్చారా చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వివాదంపై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ వివరణ ఇచ్చారు.
ప్రధాని హైదరాబాద్ పర్యటనలో వివాదం, గందరగోళం ఏమీ లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికలు ఉన్నందున రాజకీయ చర్చకు ఆస్కారం ఇవ్వకూడదనే మోదీ ఎవరినీ కలవడం లేదని చెప్పారు. పీఎం టూర్‌లో సీఎం పాల్గొనే విషయం ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబోదని అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రధాని పర్యటనకు వెళ్లడం లేదన్న టీఆర్ఎస్ నేతలు గుర్తించాలని హితవు పలికారు. బీజేపీపై భయంతోనే టీఆర్ఎస్ నేతలు ఆత్మగౌరవం అంశం తెరపైకి తెస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.