జమ్ము కశ్మీర్ లో అక్రమ కట్టడాల కూల్చి వేత కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. జమ్ము కశ్మీర్‌లో తమ రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న ప్రజలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
కశ్మీర్‌లో సామాన్యులు చెప్పే మాటలను పట్టించుకోకుండా వారి ఇండ్లను బుల్‌డోజర్‌లో ధ్వంసం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. దేశం అనేది మనుషులతో తయారైందని చెప్పారు. శాంతి, విశ్వాసం కోసం, సాధారణ ప్రజల మాట వినడం అవసరమన్నారు. వారి హక్కులను బుల్డోజర్ కింద నలిపివేయకూడదన్నారు.
అక్రమ కట్టడాల కూల్చివేతపై కేంద్రం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్ని మండిపడ్డారు. జమ్ము కశ్మీర్ ప్రజలకు ఉద్యోగాలు కావాలన్నారు. వారికి మంచి వ్యాపార అవకాశాలు కావాలని, వారు ప్రేమ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కానీ వారికి వాటి బదులు బీజేపీ బుల్డోజర్ అందిస్తోందన్నారు.
ఎన్నో దశాబ్దాలుగా తమ కష్టార్జితంతో ప్రజలు సంపాదించుకున్న భూమిని వారి నుంచి లాక్కుంటున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలను విభజించకుండా ఏకం చేయడం ద్వారా మాత్రమే శాంతి, కాశ్మీరీలు పరిరక్షించ బడతారని పేర్కొన్నారు.