సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికులతో పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొన్ని సలహాలిచ్చారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ అయిందని.. సమయం వృథా చేసుకోవద్దని ఆయన చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించండని సూచించారు.
అయితే విద్యా సంస్థలకు ఈనెల 13 నుంచి 17 వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో రోడ్ల పై పండగ రద్దీ మొదలైంది.నిన్నటి నుంచే పండగ ప్రయాణాలు జోరందుకున్నాయి. స్వగ్రామాలకు తరలిపోతున్నారు జనాలు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
రైళ్లు,బస్సుల్లో సీట్లు దొరక్క పండక్కి వెళ్లేవారు పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ భారీగా పెరిగింది. పండుగకు ఒక రోజు ముందు నుంచే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్ లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు. ఒకే సమయంలో వాహనాలు వేల సంఖ్యలో తరలిరావడంతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అర కిలోమీటరు మేర నిలిచిపోయాయి.
ఒక దశలో ట్రాఫిక్ కిలోమీటరు మేర నిలిచిపోయింది. ఫాస్టాగ్ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాలు పరిమితికి మించి రావడం, కొన్ని వాహనాల ఫాస్టాగ్ లు స్కాన్ కాకపోవడంతోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని టోల్ ప్లాజా నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు. రాచకొండ పోలీసులు, జీఎంఆర్ టోల్ గేట్ సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్దీకరిస్తున్నారు.