కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలు, న్యాయమూర్తులు, రైతులు, వ్యాపారులతో సహా అందరితోనూ ఘర్షణ పడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థ సుప్రీంకోర్టు, కేంద్రం మధ్య నడుస్తున్న సమస్యపై మీడియాలో వచ్చిన వార్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…
ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కేజ్రీవాల్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందరితో ఎందుకు పోరాడుతోంది? అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, వ్యాపారులతో? అందరితో గొడవలు పెట్టుకుంటే దేశం అభివృద్ధి చెందదన్నారు.
మీ విధులు మీరు నిర్వర్తించండి, ఇతరులను వారి విధులను నిర్వర్తించనివ్వండని ఆయ అన్నారు. అంతేకానీ ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకండని సూచించారు. ఢిల్లీలోని ఆప్ సర్కార్‌కు కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్‌తో అనేక రకాల పాలన, అధికార పరిధికి సంబంధించిన విషయాలపై గత కొన్ని నెలలుగా వార్ నడుస్తోంది.
ఇటీవల పాఠశాల ఉపాధ్యాయులను శిక్షణ కోసం ఫిన్‌లాండ్‌కు పంపాలన్న ఆప్ ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించడంలో జాప్యం జరిగిందని ఆరోపిస్తూ గత నెలలో సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ ఎమ్మెల్యేలు రాజ్ నివాస్‌కు మార్చ్ చేశారు.