లాక్ డౌన్ నుండి అనేక సడలింపులు ఇచ్చిన తెలంగాణ సర్కార్… ఇంట్లో పనిచేసే వారికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై మున్సిపల్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు.
ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో ఇంట్లో పనికి సహాయంగా పనిచేసే వారు చాలా మంది ఉంటారు. అయితే… లాక్ డౌన్ సడలింపులు వారికి కూడా వర్తిస్తాయా లేదా అన్న అనుమానంతో మున్సిపల్ శాఖ అధికారులను రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వివరణ కోరాగా ఈ మేరకు మున్సిపల్ శాఖ స్పందించింది.
ఇంట్లో పనిచేసే వారు బయట నుండి వస్తుంటారు. అలాంటి సమయంలో వైరస్ బయటి నుండి ఇంట్లో వారికి, ఇంట్లో వారి నుండి పని చేసే వారికి సోకి తద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి ద్వారా వైరస్ సోకినట్లు గుర్తించాం. అందుకే అనుమతి ఇవ్వటం లేదని జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.
ముఖ్యంగా రెడ్ జోన్ లో ఉన్న హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఈ రూల్ అమలులో ఉంటుందని, ఎవరూ అతిక్రమించినట్లు తెలిసినా చర్యలుంటాయని తెలిపారు.
అయితే… రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేన్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది.