భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గవర్నర్ తమిళి సైని కలిసి ప్రధాన సమస్యలను ఆమెకు విన్నవించారు. భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీని మూడు పంచాయతీలుగా విభజిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో అనైతికంగా ప్రవేశపెట్టి ఆమోదించిన తీర్మానాన్ని చట్టం చేయొద్దని పొదెం వీరయ్య గవర్నర్ ను వేడుకున్నారు.
మూడు పంచాయతీల విభజనను భద్రాచలం ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన అనంతరం ముంపు మండలాలు ఏపీలో కలపడం వల్ల భద్రాచలం శివారు ఐదు పంచాయతీలు ఆంధ్రాలో కలపడం వల్ల ఊరు రెండు కిలోమీటర్ల లోపే ఉందన్నారు. ఫలితంగా ఇప్పటికే డంపింగ్ యార్డ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న భద్రాచలాన్ని మూడు ముక్కలుగా విభజిస్తే భద్రాచల ప్రజలు సాంకేతికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
జీవో నెంబర్ 45 ద్వారా అసెంబ్లీలో ఆమోదం పొంది తమరి దగ్గరికి వచ్చిన మూడు పంచాయతీల బిల్లును పున:పరిశీలన చేసి రద్దు చేయాలని వేడుకున్నారు. అలాగే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ముంపు రైతులకు ఎకరానికి 30 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇప్పించాలని కోరారు.
రెండు మూడు పంటలు పండిస్తున్న భూములను రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ నష్టపరిహారంగా 8 లక్షలకే తీసుకుంటున్నదని వినతిపత్రంలో పేర్కొన్నారు. పుణ్యక్షేత్రమైన భద్రాచలం ప్రాంత అభివృద్ధి విషయమైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేసే విషయంలో సహాయం చేయాలని కోరారు.