బొగ్గు దొంగతనం కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీని విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ)కి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థకు సహకరించాలని టీఎంసీ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అంతేకాకుండా ఈడీ అధికారులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీం కోర్టు తెలిపింది.
అభిషేక్ బెనర్జీని ప్రశ్నించాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని కనీసం 24 గంటల ముందు ఆయనకు ఈడీ తెలియజేయాలని సూచించింది. దర్యాప్తు అధికారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వారు సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది.
కేసు విషయంలో ఎలాంటి ఆటంకాలు సృష్టించాలని చూసినా, జోక్యం చేసుకోవాలని ప్రయత్నించినా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహించబోమని మమతా సర్కార్ ను సుప్రీం కోర్టు హెచ్చరించింది.