కర్ణాటక ప్రజల్లో ఎవరైనా 200 యూనిట్ల లోపు విద్యుత్తును వాడి ఉన్న పక్షంలో జూన్ 1 నుంచి కరెంట్ బిల్లులు చెల్లించరాదని మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కోరారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని, ఉచిత విద్యుత్ నిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. పైగా దీనితో బాటు ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన 5 హామీలను అమలు చేస్తామని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం అధికార పగ్గాలను చేబట్టిన రోజునే ప్రకటించారని ఆయన అన్నారు.
ఎలాంటి షరతులు లేకుండా ఈ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వానికి బీజేపీ జూన్ 1 వరకు గడువునిచ్చిందని ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్ పథకాన్ని వచ్చే నెల నుంచి అమలు చేయకపోతే తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
మొదట తాను మైసూరు-కొడగులో నిరసన పాటిస్తానని ప్రతాప్ సింహా ప్రకటించారు. ఎవరైనా 200 యూనిట్లకన్నా ఎక్కువ కరెంట్ వాడి ఉంటే ఇన్ని యూనిట్లవరకు ఉచిత పథకాన్ని వర్తింపజేసి ..అధిక యూనిట్లకు అయిన వ్యయాన్ని సర్దుబాటు చేయాలని కుడా ఆయన సూచించారు.
అయితే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోని గ్రామాల ప్రజలు ..విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఇదివరకే నిరాకరించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించిందని, అందువల్ల తాము బిల్లులు చెల్లించేది లేదని .. విద్యుత్ శాఖ సిబ్బందికి చెప్పి.. వారు షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీ అయితే ఇచ్చింది కానీ ఇప్పుడు దీని అమలుపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసినందువల్ల రాష్ట్ర ఖజానాపై పడే భారాన్ని మదింపు చేస్తోంది.