అవినీతికి పాల్పడే వారిని తాను సమర్థించబోనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. అవినీతికి ఎవరు పాల్పడినా వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని ఆమె పేర్కొన్నారు.
ఎవరైనా దోషిగా తేలితే వారికి జీవితా ఖైదు విధించినా తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కానీ తన పేరును మాత్రం ఇందులోకి లాగవద్దన్నారు. తాను ప్రభుత్వం నుంచి కనీసం జీతం కూడా తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు.
బెంగాల్ మంత్రిని పార్థ చటర్జీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. చటర్జీ అరెస్ట్ మెమోలో కీలక విషయాలు ఈడీ వెల్లడించింది. అరెస్టైన తర్వాత చటర్జీ దీదీకి నాలుగు సార్లు ఫోన్ కాల్స్ చేశారని, కానీ దీదీ ఆ కాల్స్ కు సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్థ చటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. పార్ధ సన్నిహితురాలు ఇంట్లో రూ. 21 కోట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.