సూపర్ మార్కెట్ లో బిల్ పే చేసేటప్పుడు మీ మొబైల్ నెం, ఇంకా మీ పర్సనల్ డీటైల్స్ ఇస్తున్నారా.. అయితే ఇక నుంచి అస్సలు ఇవ్వొద్దు. ఎందుకంటే సూపర్ మార్కెట్స్ లో బిల్లు చెల్లించేటప్పుడు కొనుగోలుదారుడి మొబైల్ నెంబర్,వ్యక్తిగత డీటైల్స్ తీసుకోవటాన్ని ఆపేయాలని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ రిటైల్ సంస్థలకు ఆదేశించింది.
అంతే కాదు.. మీ డీటైల్స్ ఇవ్వమని ఒత్తిడి చేస్తే కస్టమర్స్ రక్షణ చట్ట ఉల్లంఘన కింద వస్తుందని కేంద్రం తాజాగా గైడ్ లైన్స్ ను జారీ చేసింది. అదే విధంగా ఈ మార్గదర్శకాలను తప్పని సరిగా ఫాలో కావాలని రిటైల్ ఇండస్ట్రీ, సీఐఐ, ఫిక్కీలను కోరింది. అయితే ఇలా వినియోగదారుల నుంచి పర్సనల్ డీటైల్స్ సేకరించడం వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగమే అవుతుందని ఆ శాఖ సెక్రెటరీ రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
ఇక చట్టం ప్రకారం, కస్టమర్స్ మొబైల్ నంబర్స్, వ్యక్తిగత డీటైల్స్ సేకరించడం నేరం. వినియోగదారులపై ఒత్తిడి తేవడం కూడా సరైంది కాదని.. వ్యక్తిగత ఫోన్ నెంబర్లతో బిల్లింగ్ చేయడం వెనుక ఎలాంటి హేతుబద్ధత కూడా లేదని ఆయన అన్నారు. అయితే ఆన్ లైన్ మోసాలు, వాట్సాప్ మెసేజ్ లతో ఆర్థిక నేరాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖకు ఎన్నో ఫిర్యాదులు అందాయి. ఈనేపథ్యంలోనే ఆ శాఖ తాజా మార్గదర్శకాలను వెల్లడించడం జరిగింది.