సర్కారుకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోవటంతో దేశీయ టెలికం సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని, ఇబ్బందులను నెలకొంటున్నాయి. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు గడువులోపు బకాయిలను చెల్లించాలంటూ సంస్థలకు డీవోటీ నోటీసులు ఇస్తుండటంతో, వివిధ రూపాల్లో ఈ బకాయిలను చెల్లించేందుకు టెలికం సంస్థలు నానా కష్టాలు పడుతున్నాయి.
ప్రస్తుతానికి అప్పులు తీసుకుని బకాయిలు చెల్లిస్తున్న ఎయిర్ టెల్, వోడాఫోన్ , ఐడియా సంస్థలు ఆ అప్పులను తీర్చేందుకు చార్జీలు పెంచి నిధులను సమకూర్చుకోటం తప్ప ఇంకో మార్గం కనపడటం లేదు. ఒకవైపు 5 జి నెట్ వర్క్ విస్తరణపై పెద్దమొత్తంలో నిధులు వెచ్చించాల్సి రావటం, మరోవైపు రిలయన్స్ జియో కు వినియోగ దారులు చేజారిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంకోవైపు కేంద్రానికి భారీగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండటంతో… వీటన్నింటి మధ్య సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు టెలికామ్ సంస్థలు డిసెంబర్ నుంచి ఏకంగా 42 శాతం వరకు చార్జీలను పెంచేశాయి. తాజా పరిణామాల దృష్ట్యా మరింత పెంపుకు టెలికామ్ సంస్థలు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. జియో రాక ముందు పరిస్థితులు వేరేగా ఉన్నప్పటికీ 2016 లో జియో వచ్చిన తరువాత 4 జీ సేవలను ఉచితంగా ఆరంభించి పెద్ద సంఖ్యలో వినియోగ దారులను సొంతం చేసుకుంది.
డేటా, కాల్స్ పరిమితి లేకుండా ఉచితంగా అందించి వినియోగదారుని వినియోగాన్ని కొత్త పుంతలు తొక్కించింది. జియో దెబ్బకు రిలయన్స్, ఎయిర్ టెల్ , టాటా డొకోమో, వోడాఫోన్ ఇలా అందరూ దుకాణాలను మూసి వేసుకోవాల్సి వచ్చింది. మూడు సంవత్సరాల్లో వినియోగదారుల సంఖ్య పరంగా జియో నెంబర్ వన్ గా నిలిచింది. జియో దెబ్బకు ఆదాయం పడిపోయి ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు ఇప్పుడు ఏజీఆర్ బకాయిలు వచ్చిపడడం కంపెనీలు గుక్క తీప్పుకోకుండా చేస్తోంది. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో గత 20 ఏళ్లకు సంబంధించి స్పెక్ట్రమ్, ఇతర బకాయిల రూపంలో టెల్కోలు రూపంలో కేంద్రానికి రూ.1.47 లక్షల కోట్లను చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్‌టెల్ రూ.35వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు చార్జీల పెంపే వాటి ముందు ఉన్న మార్గం. అదే జరిగితే డేటాను పొదుపుగా వాడుకోవాల్సిన రోజులు దగ్గర పడ్డట్లే.