– కేసీఆర్ ఇలాఖాలో ఇదీ సీన్
– తుమ్మితే ఊడిపోయే ఇళ్లు
తెలంగాణ సర్కార్ ప్రెస్టేజియస్‌గా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు.. సినిమా సెట్టింగుల కంటే అధ్వాన్నంగా మారాయి. లక్షలు పెట్టి నిర్మించామని చెప్పుకుంటున్న ఆత్మగౌరవ ప్రతీకలు.. చిన్న గాలి వానకే ఊగిపోతున్నాయి. కేసీఆర్ ఇలాఖాలో మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం నిర్మించి ఇచ్చిన ఇళ్ల దుస్థితి అయితే చెప్పలేని విధంగా ఉంది. గృహ ప్రవేశం చేసి మూడు నెలలు కూడా గడవకముందే.. ముప్పు ముంగిటపడ్డాయి. మూడు రోజల వానకు చాలా ఇళ్లల్లో నేల భాగం కుంగిపోతోంది. భూకంపమేదో వచ్చినట్టుగా ఉన్నట్టుండి ఎక్కడిక్కడ పగుళ్లు ఏర్పడుతున్నాయి. తాజాగా ముట్రాజ్‌పల్లి నిర్వాసితుల కోసం కట్టించిన ఇళ్లల్లో.. మరోసారి నాణ్యతా లోపాలు బయటపడ్డాయి.
ముట్రాజ్‌పల్లి ఒక్కటే కాదు.. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కోసం నిర్మించిన ఇచ్చిన అర్ అండ్ ఆర్ కాలనీలో అందరిదీ ఇదే పరిస్థితి. ఆ మధ్య పల్లెపహాడ్ గ్రామానికి చెందిన ఓ నిర్వాసితుడి ఇంటి వెలివేషన్ కూలిపోగా.. ఆ తర్వాత ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి నిర్వాసితుడి డబుల్ బెడ్ రూమ్ గోడలు నెలకొరిగాయి. ఇలా వరుసగా ఇవే ఘటనలు జరుగుతుండటంతో.. ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందో అని అందులో ఉన్నవారు బిక్కుబిక్కుమంటున్నారు.
ఆర్ అండ్ ఆర్ కాలనీలో కడుతున్నవి ఇండ్లు కావు.. ఆత్మగౌరవ ప్రతీకలు అంటూ సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ నిర్వాసితులను మునగచెట్టు ఎక్కించారు. కానీ మల్లన్నసాగర్ పేరుతో తమ ఊళ్లను ముంచిన కేసీఆర్.. నాసిరకం ఇళ్లను అంటగట్టి మరోసారి ముంచారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.