కరీంనగర్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి ఓ కారు దూసుకుపోవడంతో.. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రకటించింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. అటు రోడ్లపై ఎవరూ వ్యాపారాలు చేయకూడదని మంత్రి తేల్చిచెప్పారు. రోడ్డు పక్కన ఆక్రమణల తొలగింపు కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నామని అన్నారు. నగరంలో 14 కి.మీ విస్తీర్ణంలో రెడ్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాగా.. కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన సీస కమ్మరి వృత్తి చేసుకునే వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. కొంతమందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మృతి చెందినవారిలో ఒకరు ఘటనా స్థలంలోనే చనిపోగా.. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదం జరిగిన తరువాత కారును వదిలేసిన మైనర్ బాలురు పరారయ్యారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వారు మైనర్లు అని పోలీసులు తెలిపారు. కారు యజమాని రాజేంద్రప్రసాద్ తోపాటు మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో కారులో రాజేంద్రప్రసాద్ కుమారుడుతో పాటు.. మరో ఇద్దరు మైనర్లు ఉన్నారని చెప్పారు.
కారు అదుపు తప్పుప్పినపుడు కంట్రోల్ చేయడానికి.. బ్రేక్ బదులు, క్లచ్ తొక్కడంతో ఈ దుర్ఘటన జరిగింది. ముందుగా రాజేంద్ర ప్రసాద్ తానే కారు నడిపానని నమ్మించే ప్రయత్నం చేశాడని.. తరువాత విచారణలో మైనర్ బాలుడు డ్రైవ్ చేసినట్టు తేలిందని పోలీసులు చెప్పారు. ముగ్గురు మైనర్లపై యాక్సిడెంట్ కేసు కాకుండా హత్య కేసు నమోదు చేశారు. దాంతో పాటు మైనర్లకు కారు ఇవ్వడం వలన రాజేంద్ర ప్రసాద్ పై కూడా కేసు ఫైల్ అయింది.