కేజీ టూ పీజీ విద్య, ఇంటికో ఉద్యోగం, పేదలకు ఉచిత వైద్యం.. ఇలా అనేక హామీలు ఇచ్చి టీఆర్ఎస్ రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రతీ పేదవానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు అనే ప్రపోజల్ ను ప్రభుత్వ పాలకులే ప్రజల్లో గట్టిగా నాటుకునేలా చేశారు. కానీ.. మాయ మాటలు చెప్పి పేదల ఓట్లతో గద్దెనెక్కన తర్వాత.. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పేదల ఉసురు తీస్తున్నారని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి. ఓట్లప్పుడు ఇంటి చుట్టూ తిరిగి కాళ్లు పట్టుకున్న నేతలు..ఇచ్చిన హామీలను అమలు చేయాలని పోతే కాళ్లతో తన్నుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా.. ఎన్నికల ముందు ప్రకటించిన హామీలు నెరవేర్చాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల ప్రజలు నిరసనకు దిగారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన వారికి కాకుండా అధికార పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేశారని ఆరోపించారు. కావాలని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన అనుచరులకు కేటాయించారని మండిపడ్డారు.
100 మందికి ఇళ్లులు పంచితే.. అందులో ఉన్న వారంతా టీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులేనని ఆరోపించారు.అర్హులైన పేదలకెవరికీ.. ఇళ్లులు ఇవ్వలేదని విమర్శించారు. కేవలం ఆ 100 మంది ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే గా పదవిని పొందలేదని నిలదీశారు. అంధికారపార్టీ అండదండలతో.. పైరవీలు ఉన్న వారికి మాత్రమే ఇండ్లు ఇచ్చారని ఆరోపించారు. కనీసం గ్రామంలో సర్వే కూడా జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంత మాత్రం దానికి పేదల పేర్లతో ఎందుకు వాడుకోవడం అని నిలదీశారు.
కాగా.. తాజాగా సత్తుపల్లి పట్టణంలో నిర్మించిన 100 డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేశారు. అర్హులైన వారు ఎవరు లేరనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఎలాంటి సర్వే జరపకుండానే పార్టీ కార్యకర్తలను సెలెక్ట్ చేసి.. డ్రా సిస్టమ్ ద్వారా ఇండ్లను పంచారని ఆరోపిస్తూ స్థానిక ప్రజలు ఆందోళనలకు దిగారు.