యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 వ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ఈసారి ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. గతంలో కొరటాల-తారక్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఇంకా ఈ సినిమా షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కాగా, రీసెంట్‌గా తారక్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించడం ఖాయమని తారక్ ఓ ఈవెంట్‌లో తెలిపాడు.
ఇక ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్దిరోజులకే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కాగా, ఇప్పుడు మార్చి నెలలో ఈ సినిమాకు సంబంధించి మరో రెండు అప్డేట్స్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ సినిమా పూజా కార్యక్రమాలను మార్చి 18న నిర్వహించాలని.. మార్చి 30 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అమెరికాకు వెళ్లాడు. ఆయన తిరిగి రాగానే కొరటాలతో మూవీని స్టార్ట్ చేసి నాన్-స్టాప్‌గా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.