చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులను అదుపు చేసేందుకు అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. అనేక నగరాల్లో లాక్ డౌన్లను విధించారు. ఆంక్షలు అతిక్రమించి బయటకు వచ్చినవారిని పోలీసులు, హెల్త్ వర్కర్లు వెంటబడి మరీ తరుముతూ కొడుతున్నారు. బలవంతంగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో జీ జిన్ పింగ్ పై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది.
బీజింగ్, షాంఘై వంటి నగరాల్లో వారు నిరసనలకు దిగుతున్నారు. జిన్ జియాంగ్ రాజధాని ఉరుమ్ క్వి లోని ఓ భవనంలో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 10 మంది మరణించగా 9 మందికి పైగా గాయపడ్డారు. లాక్ డౌన్ కారణంగా ఈ భవనం లోని వారు బయటకు రాలేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని ఇంటర్నెట్ లో నెటిజన్లు మండిపడ్డారు.
దీన్ని అధికారులు తోసిపుచ్చుతున్నప్పటికీ ప్రజల ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. షాంఘైలోని ఉరుమ్ క్వి రోడ్డు వద్దకు నిన్న రాత్రి పెద్ద సంఖ్యలో చేరుకున్న వీరు భారీ నిరసనకు దిగారు. ఉరుమ్ క్వి నగరంలో లాక్ డౌన్ ని ఎత్తివేయాలని, జిన్ జియాంగ్ లో ఆంక్షలను రద్దు చేయాలని, అసలు చైనా అంతటా లాక్ డౌన్లు ఉండరాదని వీరు నినాదాలు చేశారు.
వీరి నిరసన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ డౌన్, జిన్ పింగ్ డౌన్ అన్న స్లోగన్లు మిన్నుముట్టాయి. ఇటీవలి కాలంలో ఇంతటి భారీ నిరసన ప్రదర్శనలను తాము చూడలేదని నెటిజన్లు పేర్కొన్నారు. కొందరు సోషల్ మీడియా యూజర్లు.. ఈ ప్రొటెస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని పోస్ట్ చేస్తూ.. మేమూ మీ వెంటే అని మద్దతునిచ్చారు. షాంఘైలోని సుమారు 25 మిలియన్ల మంది కొన్ని నెలల తరబడి లాక్ డౌన్ లో మగ్గారు.