టెక్సాస్ : అమెరికాలో లా అండ్ ఆర్డర్ అంత గొప్పగా లేదు. తుపాకుల మోత మోగుతోంది. నెలరోజుల్లో 35 మంది వరకు దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించారు. టెక్సాస్‌లో వన్ మంత్ గ్యాప్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. తాజాగా ఒడెస్సా ప్రాంతంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. కాల్పులు జరిగినట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఒక దుండగుణ్ణి హతమార్చారు. టొయోటా కారులో వచ్చిన ఇద్దరు దుండగులు మొదట యూఎస్ పోస్టల్ సర్వీస్ వ్యాన్‌ని ఎత్తుకెళ్లిపోయారు. తర్వాత అదే వ్యాన్‌లో వచ్చి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మిండ్‌ల్యాండ్, ఒడెస్సా నగరాల మధ్య గల ప్రాంతంలో వీళ్లు ప్రయాణిస్తోన్న కారును అనుమానం వచ్చి ఆపిన పోలీస్‌పై వారు ముందు కాల్పులకు తెగబడ్డారు. తర్వాత రోడ్డుపై వెళ్తున్న జనంపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి వయసు ముప్పయేళ్లు వుంటుందని పోలీసుల అంచనా. అతను అమెరికన్ అనే అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని ఒడెస్సా మెడికల్ సెంటర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అందరికీ చికిత్స అందజేస్తున్నారు. రెండేళ్ల వయసున్న ఓ చిన్నారి కూడా గాయపడిన వారిలో వుండటం అక్కడ అందర్నీ కలచివేసింది. గాయపడినవారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ జరిగిన కాల్పులపై స్పందించారు. అధికారులు తనకు పూర్తి వివరాలు అందించారని, దీనిపై ఎఫ్‌బీఐతో పాటు ఇతర భద్రతాధికారులు దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ ఈ ఘాతుకాన్ని మూర్ఖుల చర్యగా చెప్పుకొచ్చారు. లాఅండ్ ఆర్డర్ సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇలాంటి దుశ్చర్యలను టెక్సాస్ ప్రజలు ఐక్యంగా ఉండి ఎదుర్కొంటారని అన్నారు. టెక్సాస్‌లో ఇలాంటి ఘటనలు ఇప్పుడు కొత్త కాదు. ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లోకి ఆగస్టు 4న మారణాయుధాలతో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గాయపడ్డారు. మర్నాడే ఓహియోలో మరో గుర్తుతెలియని మనిషి జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ఈ గన్ పడగ విప్పుతోంది. తరుచూ ఏదో ఓ ప్రదేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటునే ఉన్నాయి.