తెలంగాణలో టీఆర్ఎస్‌కు నూకలు చెల్లిపోయాయని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు. అందుకే బీఆర్ఎస్ పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపారని సీఎం కేసీఆర్‌పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ బంగారు మయమైందంటూ జాతీయ పత్రికలు, టీవీలల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దేశ ప్రజల్ని కేసీఆర్ మోసం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ అప్పులు పాల్జేశామన్నారు. బ్యాంకులకు, కార్పొరేషన్లకు యావత్ రాష్ట్రాన్ని కేసీఆర్ కుదువ పెట్టారని ఆరోపించారు.
రైతులను అరిగోస పెడుతున్న ధరణి పోర్టల్ దేశానికి ఆదర్శమా? అని ఆయన ఫైర్ అయ్యారు. గుడి –బడి సొమ్ములను దిగమింగడం, డిస్కంలను నిండా ముంచడమే దేశానికి ఆదర్శమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని దేశంలో ఏర్పాటు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమా? అని నిప్పులు చెరిగారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్ఎస్ విధానమా? అని ఆయన ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయాలనుకోవడమే బీఆర్ఎస్ సిద్ధాంతమా? అని మండిపడ్డారు. లిక్కర్ పాలసీని దేశానికి విస్తరింపజేయడమే సీఎం కేసీఆర్ ఆదర్శమా? అని ప్రశ్నించారు.