– నోటిఫికేషన్ పేరుతో నిరోద్యోగ భృతికి గండి
– ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్యారా రూ. 1810 కోట్లు
– కరోనా కారణంగా ఇవ్వలేకపోతూన్నాం అంటూ మొండి చేయి
– ఉద్యోగాలను ఇవ్వమంటే బర్లను గొర్లను ఇస్తామంటున్న ప్రభుత్వం
– రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అంధకారం
– నిరుద్యోగ భృతిని మరిపించేందుకే నోటిఫికేషన్ల డ్రామాలు
– ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు
నీళ్లు నిధులు నియామకాల లక్ష్యంతో రాష్ట్రంలో ఉద్యమం ఉదృతం అయింది. ఆంధ్ర పాలకులతో కొట్లాడి.. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని రంగాలకు చెందిన శ్రామికులు, సామాన్యులు సైతం ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అనేక మంది నిరుద్యోగ యువకులు ఆత్మబలి దానాలు చేశారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాకారులను ఊదర కొట్టి.. రాష్ట్రం రాకుండా అడ్డు పడిన వ్యక్తులను పక్కన పెట్టుకున్నారు కేసీఆర్ అని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.
2018, జనవరి 28.. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి అందిస్తాం.. దీనికోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. డిగ్రీలు పూర్తి అయిన వారిని నిరుద్యోగులుగా గుర్తించి, భృతి ఇస్తాం అని కేసీఆర్ ప్రకటించిన రోజు. ఈ మాట విన్న ప్రజలు, నిరుద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేశారు. కానీ.. ఆ సంతోషం ఎంతో కాలం నిలబడలేదు. 2019, ఫిబ్రవరి 23 న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్యారా నిరుద్యోగ భృతి కోసం రూ. 1810 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితుల కారణంగానే నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ప్రకటించింది.
కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతిపై అధ్యయనం చేసి కచ్చితంగా నిరుద్యోగ భృతి ఇచ్చి తీరుతామని ప్రకటించింది. కరోనా వల్ల తెలంగాణకు లక్ష కోట్లకుపైగా నష్టం వచ్చిందని పేర్కొంది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చే భృతిపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రకటన చేశారు. కానీ.. దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు దీనిపై మార్గదర్శకాలు కూడా రెడీ చేయలేదు. ఎంతమందికి ఇవ్వాలి.. దేనిని ప్రామాణికంగా తీసుకోవాలనే నిబంధనలను కూడా తయారు చేయలేదు.
తాజాగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారు. దీంతో నిరుద్యోగులకు భృతి లేనట్టేనని పుకారు వినిపిస్తోంది. రాష్ట్ర టీఎస్పీఎస్సీలో 2018 నాటికే వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్టర్ అయిన నిరుద్యోగులు 24.60 లక్షల మంది ఉన్నారు. వీరంతా 2018 నాటికే డిగ్రీలు పూర్తి చేశారు. దీనికితోడుగా తెలంగాణ ఉపాధి కల్పనా సంస్థలో 11.20 లక్షల మంది నమోదై ఉన్నారు. వీరిలో కొంతమందికి ప్రైవేట్ ఉద్యోగావకాశాలు కల్పించినా.. ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని 2018లో ప్రకటించిన కేసీఆర్ సర్కారు.. ఇంతవరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో 23 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు పలు సర్వేల్లో కూడా తేలింది. ప్రభుత్వం సేకరించిన వివరాలతో పాటుగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో నిరుద్యోగుల లెక్కలు వెల్లడయ్యాయి. అప్పుడు.. ఇప్పుడూ ఆశల్లో ముందుగా నిరుద్యోగుల లెక్క తేలిన తర్వాతే నిరుద్యోగ భృతి అందిస్తారంటూ ప్రభుత్వ వర్గాల నుంచి చెప్పుతూ వచ్చారు. ఉప ఎన్నికల సమయాల్లో ఇది బాగానే ప్రచారానికి పనికొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలి ఎన్నికలు, దుబ్బాక, నాగార్జున సాగర్, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దీనిపై పలుమార్లు ప్రకటన చేస్తూనే వచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇక భృతి రావడమే అన్నట్టుగానే సినిమాను చూపించింది.
వీరిలో 76 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాల వేటలో ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ప్రభుత్వం సేకరించిన లెక్కల ప్రకారమే కనీసం 23 లక్షల మంది నిరుద్యోగులకైనా నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ఆర్థిక శాఖ కూడా లెక్కలు వేసింది. డిగ్రీలు చదివిన వారిని, అందులోనూ 35 నుంచి 44 ఏండ్లలోపు వారిని అర్హులుగా తీసుకుంటే అటు టీఎస్పీఎస్సీ, ఇటు ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ లో కలుపుకుని కనీసం 23 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి. దీంతో రూ. 693.68 కోట్లు ప్రతినెలా అవసరమని నివేదికను కూడా సిద్ధం చేశారు ఉన్నతాధికారులు. దీనిలో భాగంగానే 2019 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముందుగా రూ. 1810 కోట్లు కేటాయించారు. కానీ.. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు, ఆదేశాలు రాలేదు.
సీఎం నుంచి ఆమోదం రాకపోవడంతో భృతి అంశం పెండింగ్ పడింది. అయితే.. నిరుద్యోగులంతా నోటిఫికేషన్ విడుదల చేస్తారా..? లేక నిరుగద్యోగ భృతి ప్రకటిస్తారా అనే కోణంలో మండిపడటంతో.. నిరుద్యోగ భృతి అంశాన్ని పక్క తోవ పట్టించేందుకే.. నోటిఫికేషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతానికి భృతి అంశంలో కేసీఆర్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో నిరుద్యోగ భృతి నుంచి కూడా ప్రభుత్వం తప్పించుకున్నట్టే అని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.