టర్కీ, సిరియా లను వణికించిన భూకంపం గుండెల్ని పిండేసే విషాద కథలను వెలికి తీసుకువస్తోంది. నేలమట్టమైన భవన శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని ఓ వైపు సహాయక బృందాలు నానా పాట్లు పడుతున్నప్పటికీ ఆ శిథిలాల కిందే ప్రాణాలు వదులుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. అధికారిక లెక్కల ప్రకారం 46 వేలమందికి పైగా ప్రజలు మరణించారని చెబుతున్నా.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువేనని విదేశీ వార్తా సంస్థలు తెలిపాయి. ఒక్క టర్కీలోనే 2 లక్షల 64 వేలకుపైగా భవనాలు భూకంప ధాటికి కుప్పకూలాయి. లక్షలాది ప్రజల్లో గల్లంతయిన వారి సంఖ్య కూడా ఎక్కువేనని ఈ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
శిథిలాల కింద నుంచి అనూహ్యంగా బతికి బయట పడిన చిన్నారులు ,టీనేజర్లు, పెద్దలకు ఆసుపత్రుల్లో డాక్టర్లు నిర్విరామంగా చికిత్స చేస్తున్నారు. సిరియాకు చెందిన భార్యాభర్తల జంటను సహాయక బృందాలు 12 రోజుల తరువాత.. 296 గంటల అనంతరం నిన్న దక్షిణ టర్కీలోని ‘అంతాఖ్యా’ సిటీలో శిథిలాల నుంచి బయటికి తీసి రక్షించాయి.
వీరి బిడ్డలు ఇద్దరు మాత్రం హాస్పిటల్ లో మరణించారు . సమీర్ మహమ్మద్ అకార్, అతని భార్య రగ్డా, ..తాము ఇన్ని రోజులు మూత్రం తాగి ప్రాణాలు నిలుపుకున్నామని చెబుతుంటే రక్షణ బృందాలు ఆశ్చర్యపోయాయి.
తన గొంతుకు తమ బిడ్డలిద్దరు ఒకటి, రెండు రోజులు రెస్పాండ్ అయ్యారని, కానీ ఆ తరువాత వారి స్పందన ఆగిపోయిందని సమీర్ మహమ్మద్ ..ఆసుపత్రిలో డాక్టర్లకు తెలిపాడు. ఈ కుటుంబాన్ని అంబులెన్స్ లో హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాల టీవీ ఫుటేజీని అనడోలు న్యూస్ ఏజెన్సీ వీడియోగా రిలీజ్ చేసింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇన్ని రోజులుగా రెస్క్యూ టీమ్స్ జరుపుతున్న గాలింపును ఇక ఆదివారంతో నిలిపివేయవచ్చునని తెలుస్తోంది.