సాధారణంగా పట్టు పురుగుల నుంచి పట్టును తీసి దాంతో పట్టువస్త్రాలను తయారు చేస్తారన్న సంగతి తెలిసిందే. పట్టు వస్త్రాలకు మార్కెట్‌లో సహజంగానే ధర ఎక్కువగా ఉంటుంది. అయితే పట్టు పురుగులే కాదు, ఓ రకమైన జాతికి చెందిన సాలీడు నుంచి కూడా పట్టు వస్తుంది. అవును.. దాంతో కొందరు కొన్నేళ్ల పాటు శ్రమించి ఒక వస్త్రాన్ని రూపొందించగలిగారు.
సైమన్ పీర్స్ అనే బ్రిటిష్ వ్యక్తి, నికోలాస్ గాడ్లే అనే అమెరికా వ్యక్తి ఇద్దరూ 20 ఏళ్ల పాటు మడగాస్కర్‌లో ఉన్నారు. 19వ శతాబ్దానికి చెందిన కొన్ని చిత్రాలను వారు చూశారు. అందులో వారికి కొన్ని వస్త్రాల చిత్రాలు ఆసక్తికరంగా అనిపించాయి. విచారిస్తే ఆ వస్త్రాలు నిజమే అని, వాటిని మడగాస్కర్‌లో ఉండే గోల్డెన్ ఆర్బ్ అనే జాతికి చెందిన సాలీళ్ల నుంచి సేకరించిన పట్టుతో తయారు చేశారని తేలింది. కానీ ఆ పట్టును సేకరించడం చాలా కష్టమైన పని.
దాదాపుగా 23వేల గోల్డెన్ ఆర్బ్ సాలీళ్లు అయితే సుమారుగా 30 గ్రాముల పట్టు వస్తుంది. ఈ క్రమంలోనే నిత్యం వారు 80 మంది కార్మికుల సహాయంతో సుమారుగా 12 లక్షల సాలీళ్ల నుంచి పట్టును సేకరించారు. తరువాత దాంతో వస్త్రాన్ని రూపొందించి దాంతో ఒక డ్రెస్ కుట్టారు. ఇక ఆ వస్త్రం సహజంగానే బంగారు రంగులో ఉంది. దానికి ఎలాంటి పెయింట్, డై వాడలేదు. ఆ సాలీళ్లకు చెందిన పట్టు చూడక్కని బంగారు రంగులో దర్శనమిస్తోంది.
ఇక ఈ పనిచేసేందుకు వారికి దాదాపుగా 8 ఏళ్లు పట్టింది. సాలీళ్ల నుంచి పట్టును సేకరించడమే కష్టం. కానీ దాంతో వస్త్రాన్ని సులభంగానే నేయవచ్చు. అయితే ఆ పట్టుతో వస్త్రాన్ని తయారు చేసి దాదాపుగా 100 సంవత్సరాలకు పైనే అయిందట. దీంతో అత్యంత అరుదైన పట్టుతో వస్త్రాన్ని రూపొందిద్దామని వారు ఆ పనిచేశారు. ఆ డ్రెస్ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.