ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయిందంటే చాలు భానుడి సెగకు జనం అల్లాడిపోతున్నారు. ఈ ఎండలు భరించలేక ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే ఇంట్లోనూ ఉక్కపోతతో ఊపిరి ఆడటం లేదు. ఈ ఉక్కపోతకు విపరీతంగా దాహం వేస్తోంది. బాటిళ్లు.. బాటిళ్లు నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. అందుకే ఈ వేసవిలో చల్లగా ఉండేందుకు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, షర్బత్ లు తాగేస్తున్నారు.
అయితే ఈ ఎండల్లో బీర్ల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు అన్ని ప్రాంతాల్లో అమాంతంగా బీర్ల అమ్మకాలు పెరగడమే ఇందుకు కారణం. బీర్లు తాగితే ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుందని కొందరు అనుకుంటారు. అయితే అది అపోహ మాత్రమేనని చెబుతున్నారు వైద్యులు.
వేసవిలో ఏ రకమైన ఆల్కహాల్ అయినా విపరీతంగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేయడంతో పాటు డీహైడ్రేషన్ బారిన పడే ముప్పు ఉందని చెబుతున్నారు. వాటికి బదులుగా పండ్ల రసాలు, పండ్లు తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. బీరు, బ్రాందీ, విస్కీ, వైన్ ఇలా అన్ని రకాల ఆల్కహాళ్లలో డయూరిట్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు.
ఆల్కహాల్ ఏదైనా మనిషికి ప్రమాదమేనన్న సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఎండాకాలంలో బీర్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. దాహం వేస్తే మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, సీజనల్ పండ్లు తీసుకుంటే ఎంతో మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.