ఇంటింటికి మంచి నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగ అని చెప్పిన సీఎం కేసీఆర్ మాటలు చూశాం. గ్రేటర్ లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం అన్న మంత్రి వర్యుల ఉపన్యాసాలూ విన్నాం. ఏ చిన్న సమస్య ఉన్నా… ఒక్క కాల్ చేస్తే చాలు, గంటల వ్యవధిలో పరిష్కరిస్తున్నాం అన్న అధికారుల గొప్పలు కూడా వింటున్నాం. కానీ… గ్రేటర్ హైదరాబాద్ లో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఒకటైన మణికొండ వాసుల కష్టాలకు సమాధానం చెప్పే వారే కరువయ్యారు. మాకు గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వమని రోడ్డెక్కినా… పట్టించుకునేవారే కరువయ్యారు.
గూడెంలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఉన్న చిట్ట చివరి ఇంటికి, శుద్ధిచేసిన మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ ప్రారంభించాం, సిద్ధిపేట మాడల్ ను రాష్ట్ర వ్యాప్తం చేశాం… ఇప్పుడు కేంద్రం సహా అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం అంటూ కేసీఆర్ అనేకసార్లు శాసనసభా వేధికగా ప్రసంగించారు. కానీ నగరంలోని మణికొండ అల్కపురి టౌన్ షిప్ వాసులకు గత 5 సంవత్సరాలుగా మంచినీరే రావటం లేదు. మంచినీటి కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి… రొడ్డెక్కారు. చిన్నపిల్లలతో సహా మానవహరం ఏర్పాటు చేసి, తమ ఇబ్బందులను ఏకరువుపెట్టారు. జలమండలి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవటం లేదని, ప్రభుత్వం ఒక్కసారి తమ గురించి ఆలోచించాలని, తమకూ మంచినీరు తాగే హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.