అప్పు చేసి పప్పుకూడు పెట్టడం ఎప్పటికైనా ముప్పే. ఓ తండ్రి కొడుకు పెళ్ళిచెయ్యాలనుకున్నాడు. కానీ కావాల్సినంత డబ్బులేదు.అప్పుచేసాడు. ఇచ్చిన వాళ్ళు ముచ్చటయ్యాకా వచ్చారు.అప్పులు తీర్చేందుకు ఆ తండ్రి యజమాని ఇంట్లోనే దొంగతనం చేసాడు.అంతే !కొడుకు అత్తారింటికి…తండ్రి జైలుకు వెళ్ళాల్సి వచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బంగంగా ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి పేరు రాజేంద్ర పండిట్, వృత్తి రీత్యా డ్రైవర్. రాజేంద్ర కొడుకు పెళ్లి ఇటీవలే జరిగింది.
ఈ పెళ్లి వల్ల అప్పుల పాలయ్యాడు. ఈ అప్పు తీర్చేందుకు యజమాని నుంచి రూ.4 లక్షలు దోచుకున్నాడు. అయితే సీసీటీవీలో అతడు దొంగతనం చేస్తున్న దృశ్యాలు నమోదు కావడంతో అతడు పట్టుబడ్డాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
రాజేంద్ర పండిట్ తన కుమారుడికి ఫిబ్రవరి నెలలో వివాహం చేశాడు. దీంతో నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పు తీర్చే మార్గం కనిపించక చాలా మదన పడ్డాడు.
చేసేదేంలేక ఈ అప్పు తీర్చేందుకు యజమాని నుంచి డబ్బులు దోచుకున్నాడు. యజమాని తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.4 లక్షలు విత్‌డ్రా చేసి కారు ట్రంక్‌లో ఉంచాడు. ఈ డబ్బును రాజేంద్ర సమయం చూసి దొంగిలించాడు.
కారులో డబ్బులు మాయమైనట్లు గ్రహించిన యజమాని రాజేంద్రను డబ్బు మాయమైన విషయాన్ని అడిగాడు. అయితే ఆ డబ్బుపై తనకు ఏమాత్రం అవగాహన లేదని రాజేంద్ర అన్నారు.
దీంతో యజమాని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చోరీపై ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు రాజేంద్ర పండిట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు