వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను పోలీసులు విచారిస్తున్నారు. అతని దగ్గర పని చేసిన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రమణ్యం జోక్యం చేసుకున్నందుకే హత్య చేశానని ఎమ్మెల్సీ ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ హత్యలో తాను ఒక్కడినే పాల్గొన్నానని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏ క్షణంలోనైనా పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
సుబ్రమణ్యం మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది. మృతుడి కుటుంబసభ్యులు, ప్రతిపక్ష నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గత గురువారం మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్సీ తన స్టిక్కర్ తో ఉన్న కారులో మృతుడి ఇంటికి తీసుకెళ్లారు. యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పారు. ఆయన మాటలు నమ్మని కుటుంబసభ్యులు నిలదీశారు. ఆ సమయంలో ఉదయ భాస్కర్ వారితో గొడవ కూడా పడ్డారు.
సుబ్రమణ్యం మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ శుక్రవారం నుంచి ఆందోళనలు మిన్నంటాయి. ప్రతిపక్షాల ఎంట్రీతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. చివరకు ఈ కేసులో ఎమ్మెల్సీని అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ప్రకటించారు. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసుని హత్యకేసుగా మారుస్తున్నట్టు తెలిపారు. సెక్షన్ 302 కింద ఏ1 నిందితుడిగా అనంతబాబుని అరెస్ట్ చేస్తామన్నారు.
ఇప్పటిదాకా యాక్సిడెంట్ అని బుకాయించిన ఎమ్మెల్సీ పరిస్థితులు మారిపోవడంతో చివరకు చేసేది లేక సుబ్రమణ్యాన్ని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.