జమ్ము కశ్మీర్ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ డ్రోన్‌ను భారత సైన్యం కూల్చివేసింది. కథువా జిల్లా హీరా నగర్ సెక్టార్ వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్తాన్ నుంచి భారత్ లోకి ప్రవేశించిన డ్రోన్ ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు.
‘ ఈ సెక్టార్ వద్ద సెర్చ్ పార్టీ పోలీసులు ప్రతి రోజూ విధులు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం ఒక డ్రోన్ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించినట్టు గుర్తించాం. దీంతో సెర్చ్ పార్టీ పోలీసులు కాల్పులు జరిపారు’అడిషనల్ డీజీపీ ముఖేశ్ సింగ్ తెలిపారు.
డ్రోన్ పేలోడ్ తో వచ్చిందని ఆయన తెలిపారు. డ్రోన్ లో ఏడు మ్యాగ్నటిక్ బాంబులను, మరో ఏడు యూజీబీఎల్ గ్రెనేడ్ లను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఆ ఏరియాలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.
కశ్మీర్‌లో ఉగ్రసంస్థలను ఆయుధ, మందుగుండు సామగ్రి కొరత వేధిస్తోందని ఆయన చెప్పారు. అందుకే ఆయుధాలను డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కుష్వారా జిల్లాలో ఉగ్రకదలికలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలిపారు.