రాజధాని గ్రామాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. రైతుల ఆందోళనలను డ్రోన్ చిత్రీకరణ చేస్తున్న వ్యక్తిని రైతులు అడ్డుకున్నారు. డ్రోన్ తో ఎందుకు చిత్రీకరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సివిల్ డ్రెస్ లో ఉండి డ్రోన్ ఎందుకు షూట్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ ఆపరేటర్ ను అడ్డుకోవడంతో రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో రైతుల అరెస్టుకు పోలీసులు యత్నించారు. జరిగిన సంఘటన తెలుసుకున్న చంద్రబాబు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే డిఎస్ పి లాఠీ ఛార్జ్ కు ఆదేశాలు ఇవ్వడం, డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులే వీడియో తీయించడం, తదితర ఘటనలపై పరిశీలనకు టిడిపి నిజ నిర్దారణ కమిటి ఏర్పాటు చేసింది. కమిటి సభ్యులుగా ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి జవహర్ ను నియమించారు. రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులను, రైతు కూలీలను,మహిళలనను అడిగి పూర్తి వివరాలను తెలుసుకోనున్నారు.
శిబిరం వద్దే కాకుండా గ్రామంలోనూ, ఇళ్లపైనా డ్రోన్ కెమెరాలను తిప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఎన్టీఆర్ భవన్ కు వచ్చి మాజీ సీఎం చంద్రబాబుకు మందడం వాసులు ఫిర్యాదు చెయ్యటంతో హుటాహుటిన వెంటనే స్పందించి గ్రామానికి వెళ్లాలని టిడిపి నేతలకు ఆదేశాలిచ్చారు చంద్రబాబు. .