భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత 15వ రాష్ట్రపతిగా ఆమె ప్రమాణం చేస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉదయం 10గంటల 15 నిమిషాలకు ఆమెతో ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఈ మేరకు విషయాన్ని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రమాణ స్వీకారం తర్వాత జాతినుద్దేశించి ఆమె ప్రసంగించనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
వీరితో పాటు లోక్ సభ స్పీకర్, పార్లమెంట్ సభ్యులు, పలువురు గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, త్రివిధ దళాల అధిపతులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాణ స్వీకారం తర్వాత ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు.
రాష్ట్రపతి భవన్ వద్ద నూతన రాష్ట్రపతికి ఇంటర్ సర్వీసెక్ గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆమె ఘన విజయం సాధించారు. దేశంలో తొలి గిరిజన రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టించారు.