రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను నేడు ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ముకే విజయావకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో ద్రౌపది ముర్ము విజయంపై ఆమె గ్రామస్తులు ధీమాతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆమె విజయాన్ని పెద్ద ఎత్తున సెలబ్రెట్ చేసేందుకు ఆమె స్వగ్రామం ఒడిశాలోని రాయరంగపూర్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలు వెలుపడిన వెంటనే పంపిణీ చేసేందుకు ఇప్పటికే పలు రకాల స్వీట్లను గ్రామస్తులు తయారు చేయించారు.
ఆమె గెలుపొందిన వెంటనే పెద్ద ఎత్తున గ్రామంలో విజయోత్సవ ర్యాలీలు తీయాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ గిరిజన నృత్య ప్రదర్శలను కూడా ప్రదర్శించనున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.
రాష్ట్రపతి పదవికి ఈనెల 18న ఎన్నికలను నిర్వహించారు. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను మరి కొద్ది సేపట్లో చేపట్టనున్నారు. లెక్కింపు ముగిసిన వెంటనే విజేతను ప్రకటించనున్నారు.