ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ సన్ ఫార్మాకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ఎఫ్‌డీఏ) హెచ్చరిక లేఖ పంపింది. గుజరాత్‌లోని సన్ ఫార్మా కంపెనీలో తయారీ లోపాలతో పాటు ఔషదాల ఉత్పత్తిలో మైక్రోబయాలాజికల్ కాలుష్యాన్ని అరికట్టేందుకు సూచించిన నిబంధనలు పాటించలేదని లేఖలో ఎత్తి చూపింది.
ఈ లేఖలో ఫార్మాస్యూటికల్స్‌లో కరెంట్ గుడ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్(సీజీఎంపీ) నిబంధనలను కంపెనీ ఉల్లంఘించినట్టు పేర్కొంది. కంపెనీ అనుసరిస్తున్న పద్దతులు, సౌకర్యాలు లేదా తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్ లేదా హోల్డింగ్ నియంత్రణలు సీజీఎంపీకి అనుగుణంగా లేకపోవడంతో ఔషధాలు కల్తీ చేయబడ్డాయని పేర్కొంది.
అసెప్టిక్ సమ్మేళనం, ఫిల్లింగ్ కోసం ఉపయోగించే ఐఎస్ఓ క్లీన్ రూమ్ ప్రాంతాలు చాలా నాసిరకంగా డిజైన్ చేయబడినట్టు తెలిపింది. ఆ ప్రాంతాలకు తగినంత రక్షణ కూడా లేదని వెల్లడించింది. ఐఎస్ఓ ప్రాంతాలు చాలా కీలకమైనవని, అక్కడే శుభ్రపరిచిన ఔషధ ఉత్పత్తులు బయటకు వస్తాయని చెప్పింది.
నాసిరకం డిజైన్, తగినంత రక్షణ లేని కారణాల వల్ల ఔషధాలు కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పింది. దీంతో పాటు ఔషధ ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్ లేదా హోల్డింగ్‌లో తగిన డిజైన్, తగిన పరిమాణం, దాని ఉద్దేశించిన ఉపయోగం కోసం కార్యకలాపాలను సులభతరం చేయడంలో, దాని శుభ్రపరచడం, నిర్వహణ కోసం ఉన్న పరికరాలను ఉపయోగించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంది.