విశాఖపట్టణం జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. చిన వాల్తేరులో విద్యార్ధులు డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు. బెంగళూరు నుండి స్పటిక రూపంలో ఎండీఎంఏను అక్రమంగా రవాణా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు.
వారినుండి 54 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకొని.. క్రిస్టల్ రూపంలో సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. వారికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నయనే కోణం విచారణ చేపట్టినట్టు తెలిపారు.
నగర శివారులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు మాసాల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారికి ప్రస్తుతం అరెస్ట్ అయిన వారికి ఏమైనా సంబంధాలున్నాయా..? అనే కోణంలో ఆరా తీస్తున్నామని వెల్లడించారు.
విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుండి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది.