భారతదేశానికి యువతను గొప్ప ఆస్తిగా భావిస్తాం. అందుకే యువ భారత్ గా పిలుచుకుంటాం. ప్రపంచంలో ఏదేశానికి లేని అంత యువత భారత్ సొంతం. అయితే, ఇటీవల డ్రగ్స్ యువతను పట్టిపీడిస్తోంది. ప్రభుత్వానికి ఇదొక పెద్ద సవాల్ గా మారంది. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం బాగా పెరిగిపోయింది. మారుమూల గ్రామాలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది. సుప్రీం కోర్టు కూడా మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశభవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడొద్దని స్పష్టం చేసింది. డ్రగ్స్ వాడకం, సరఫరాను కంట్రోల్ 1986లో నాక్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఏర్పాటైంది. అయితే, ఈ సంస్థని సిబ్బంది కొరత వెంటాడుతోంది. 130 కోట్ల ప్రజలున్న భారత్ లో 1100 మంది సిబ్బందితో ఈ సంస్థ నడుస్తోంది. మద్యపానం వలే డ్రగ్స్ కూడా ప్రజలకు చేరువ అయిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో చాలీచాలని మానవ వనరులతో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని అడ్డుకోవడం తలకు మించిన పని అవుతోంది.
దక్షిణ భారతదేశంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) కార్యాలయాలను విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పార్లమెంట్ లో ప్రస్తావించారు. సౌత్ ఇండియాలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిందని.. దాని కట్టడికి కొత్తగా సిబ్బందిని నియమించి ఎన్ సీబీ ని పటిష్ఠం చేస్తామని తెలిపారు. 3000 మంది సిబ్బందితో దేశంలో మరిన్ని ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ దేశంలో ఉండే పోలీస్ యత్రాంగం సహాయంతో విధులు నిర్వహిస్తోంది. అయితే, స్థానిక పోలీసులకు మాదక ద్రవ్యాల కట్టడిపై సరైన అవగాహన లేదు. ప్రత్యేక శిక్షణ కూడా ఉండదు. దీంతో, డ్రగ్స్ కేసుల విచారణలో సరైన ఆధారాలు చూపించడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మాదకద్రవ్యాల సరఫరా చేసేందుకు కొంత మంది కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇటీవల ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా పలు నగరాల్లో డ్రగ్స్ సరఫరా కావడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అరకొర సిబ్బందితో ఈ మహమ్మారికి అడ్డుకట్టవేయడం కష్టతరం. దేశ సరిహద్దుల నుంచి కూడా డ్రగ్స్ సరఫరా అవుతోందని అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో మత్తు పదార్థాల అంశం పెద్ద చర్చకు దారితీసింది. ఇక్కడ నుంచి దేశంలో పలు రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. మన దేశంలో పంజాబ్ లో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందని స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో వీటి వాడకం విచ్చిల విడిగా సాగుతోంది. కాలేజీలు, యువతే టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఓ వైపు ఈ మహమ్మారి ఇలా విస్తరిస్తుంటే.. మరో వైపు దీనిని కట్టడి చేయాల్సిన సంస్థ సిబ్బంది, మౌళిక సదుపాయాల లేమితో కిటికిటలాడుతోందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడే మేల్కోకపోతే దేశ భవిత ప్రమాదంలో పడుతోందని పలువురు హెచ్చరిస్తున్నారు.