మాదకద్రవ్యాల అక్రమరవాణాను అరికట్టడానికి ప్రభుత్వం, పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయిన కేటుగాళ్లు వారి కళ్లు గప్పి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబైలో భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు పోలీసులు.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ముందస్తు సమాచారం గురువారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా భారీగా హెరాయిన్ పట్టుబడింది. సదరు ప్రయాణికుడి వద్ద ఉన్న సూట్‌కేసులో దాదాపు 3.980 కిలోల హెరాయిన్‌ను గుర్తించి, సీజ్ చేశారు అధికారులు. దాని విలువ సుమారు రూ.24 కోట్లు ఉంటుందని చెప్పారు.
ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే, హెరాయిన్‌ను దేశంలో ఎక్కడికి తరలిస్తున్నారనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.